Thursday, June 15, 2006

పన్నొచ్చిందండోచ్‌!

గురువారం, వ్యయ నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చవితి, 1928
శా.శ


హాయ్‌,

నాకు క్రింద వరసలో పన్ను వచ్చింది. మధ్యాహ్నం అన్నం తినిపిస్తూంటే అమ్మ చూసింది. పన్నొచ్చేముందు దురదేస్తుందంట, అందుకే గాబోలు ఓ పదిహేను రోజుల్నుంచీ ఒహటే దురదగా వుండి కనిపించిందల్లా నోట్లో పెట్టుకునే వాడిని దురద తీరేందుకు. దానికి గానూ ప్రతిరోజూ అమ్మచేత తిట్లు తినేవాడిని. ఇకనైనా ఆ దురద తీరుతుందో లేదో?

మొదట పై వరుసలో పన్ను వస్తే, మేనమామ మళ్లీ నన్ను నూనెలోంచి చూడాలంట - శాంతి చేసిన తర్వాత. అసలే మామయ్య బెంగుళూరులో వున్నాడుగా, ఎలాగా? అనుకుంటూన్నారు. క్రిందే వచ్చింది కనుక ఇప్పుడా బాధ లేదు. మామయ్యా చూశావా నీకోసం ఎంత కష్ట పడ్డానో!!

అంతేకాదు, ఇప్పటిదాకా బాగా వుడికించి, మెత్తగా కలిపి అన్నం పెట్టేది అమ్మ. ఇకనుంచి ఆ బాధ లేదు - పళ్లొచ్చేస్తున్నాయిగా - పళ్లతో కరకరా నమిలి తినేస్తా!!!

Friday, June 09, 2006

నాలుగు కాళ్ళ నడక

శుక్రవారం, వ్యయ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, 1928
శా.శ


నాకు పొట్టమీద పాకటం రాలేదుకానీ, మోకాళ్ళ మీద లేచి కప్పలా దూకటం వచ్చిందని చెప్పాగా. ఇప్పుడు చక్కగా నాలుగు కాళ్ళతో నడిచినట్లుగా, మోకాళ్ళు చేతులుపయోగించి నడిచేస్తున్నా. అంతేకాదు, మాంఛి స్పీడుకూడా పికప్‌ చేసానండీ. ఇప్పుడు ఇల్లంతా తిరిగేస్తున్నా.

టీపాయ్‌ లోంచి పేపర్లు లాగి చించేస్తున్నానని, ఫిలిప్స్‌ డెక్‌ దగ్గరికెళ్ళి వైర్లన్నీ లాగుతున్నాననీ, అంతేకాదు ఫుల్‌సౌండు పెట్టేస్తున్నాననీ అమ్మ ఒకటే తిడుతోంది. ఇన్ని రోజులూ వాటిని చూస్తూ, ఎలా అందుకోవాలో తెలీక గుడ్లప్పగించి చూస్తూవుండేవాడిని. ఇంత కాలానికి వాటిని అందుకోగలిగే అవకాశమొస్తే ఆగమంటే ఎలా చెప్పండి?

అప్పటికీ వీలైనంతవరకూ, హల్లో బోల్డన్ని చీమలు, ఎర్ర చీమలు తిరుగుతుంటే వాటెనకాల తిరిగుతూంటే - అవేమో కుడుతున్నాయి. ఏం చెయ్యాలో మీరైనా చెప్పండి?

Tuesday, May 09, 2006

అమ్మయ్య!!

మంగళవారం, వ్యయ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి, 1928 శా.శ

నా తొమ్మిది రోజుల ప్రయాణ నిన్నటికి అయిపోయింది.

ఏప్రిల్ 30 నుండి నిన్నటి (మే 8)వరకూ జరిగిన 'హైదరాబాద్‌-ఇండోర్‌-శిర్డీ-హైదరాబాద్‌' ప్రయాణం సుఖంగా పూర్తయింది. ఆల్రెడీ మీకు ఆ విషయాలన్నీ చెప్పాగా!

మాతో పాటు శిర్డీ నుంచి తాతయ్య, నానమ్మ వచ్చారు కదా! ట్రైన్ దిగటం దిగటం, ఆంజనేయులు తాత వాళ్ళింట్లో దిగాం. నాన్న, రాజా మామయ్యతో ఆఫీసుకు స్టేషన్ నుంచే వెళ్ళిపోయాడు. ఆంజనేయులు తాతతో మిగిలిన వాళ్ళ మంతా వాళ్ళింటికొచ్చాం.

నాకెందుకో ఆ యిల్లు కొత్తగా వుంది. ఫస్ట్‌టైం రావడం, అందులోనూ నాన్న లేదు, నిజం చెప్పొద్దూ ... భయమేసింది నాకు. సాయంత్రం నాన్న వచ్చిన తర్వాత భోజనాలు చేసి రెండు ఆటోల్లో మాయింటికి బయలుదేరాం. నూట అరవై రూపాయలయ్యింది రెంటికీ కలిపి. విషయం ఏమిటంటే ... ఇంటి తలుపు తెరవగానే చూస్తే ఫ్రిడ్జ్‌ ఆన్‌ చేసి వుండటమే కాదు, తలుపు కూడా తెరిచే వుంది. కరెంటు బిల్లు వాయిస్తుంది ఈ సారి.

Sunday, May 07, 2006

తిరుగు ప్రయాణం

సోమవారం, వ్యయ నామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి, 1928 శా.శ

పొద్దున్నే ఆడవాళ్ళందరూ రెండో సారి గుడికెళ్ళొచ్చారు. రావటం రావటం సామాన్లు సర్దుకున్నారు. అమ్మా, నాన్న, అత్తా ముగ్గురూ మళ్ళా షాపింగ్ కు వెళ్ళారు. మేమందరం హోటల్లో వున్నాం. బావల్తో, తాతతో నాకు కాలక్షేపం.

సాయిప్రియలో భోజనంచేసి, హోటల్ వెకేట్ చేశాం. బస్టాండ్ ఎదురుగనేవుంది. సామాన్లు చేరేసిన తర్వాత కనుక్కుంటే, వినయ్ మామ వాళ్ళ బస్ ఇంకా రాలేదు. ఇంకో గంటలో వస్తుందట. శిర్డీలో మధ్యాహ్నం సుమారు రెండున్నరకు మహరాష్ట్ర ఆర్టీసీలో మన్మాడ్‌కు బయలు దేరాం నేనూ, అమ్మా, నాన్న, తాతయ్య, నాన్నమ్మానూ. బయలు దేరేటప్పుడు ఖాళీగానే వున్నా, అరగంటలో ఫుల్‌రష్‌. మరోపక్క ఎండ. నేనైతే ఆ ఎండలోనే తాతగారి చేతిలో నిద్దరోయా! (మనకది మామూలేగా!) కండక్టరు సరిగ్గా బ్రిడ్జ్‌ మీద ఆపి దింపాడు. మాతో పాటు చాలా మంది దిగారు. బ్రిడ్జి క్రిందే మన్మాడ్‌ రైల్వే స్టేషన్‌. కానీ పన్నెండు శాల్తీ లుండంతో ఇద్దరు కూలీలను మాట్లాడారు ముప్పై రూపాయలకు. సామాన్లు బరువెక్కువుండడంతో ఓ పదిరూపాయలెక్కువిచ్చాడు నాన్న.

ఓ గంటన్నర వెయిట్ చేసిన తర్వాత రైలు (మన్మాడ్‌-సికింద్రాబాద్‌) వచ్చింది. ‌రైల్లో కీచెయిన్స్ అమ్మేవాళ్ళొస్తే అమ్మా, నానమ్మా, తాతయ్యా ఓ ఇరవై కీచెయిన్స్ కొన్నారు.

రైల్వే వాళ్ళ కేటరింగ్ వాళ్ళు మూడు భోజనాలు, ఒక వెజ్ బిరియానీ చెబితే - నాలుగు భోజనాలు తెచ్చిచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి పోట్లాడితే, పదింటికి తెచ్చిచ్చాడు. పాపం తాత లేటుగా భోంచేశాడంట. పదకొండయ్యేసరికి అందరూ బెర్తులెక్కేశారు నిద్ర పోవడనికి. నేనైతే ఎనిమిదింటికే పడకేశా - పొద్దున్నే లేచి ఆడుకోవాలిగా మరి.

గుడ్‌నైట్

Wednesday, March 08, 2006

ఇంకొక్క వారం రోజులు...

బుధవారం, ఫాల్గుణ శుద్ధ నవమి, 1927 శా.శ

ఇంకో వారం రోజుల్లో వైజాగు పట్టణానికి బై..బై చెప్పేస్తున్నాను. నా కప్పుడే ఐదు నెలలు నిండాయి. 'టైమ్‌ ఫర్‌ మూవ్‌మెంట్‌'. చినముత్తేవి నుండి తాతగారు (గోపాలకృష్ణయ్య) వస్తున్నారు ... ఎందుకో తెలుసా, నన్నూ, అమ్మనూ చినముత్తేవి తీసుకెళ్ళడానికి. మాతో పాటూ అమ్మమ్మా, సామర్లకోటనుండి చిన్నమ్మమ్మా వస్తున్నారు. చినముత్తేవిలో ఒక రోజు వుండి, వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు నాతో పాటూ అమ్మ, నానమ్మ మాత్రమే వస్తున్నారట. అమ్మమ్మా వాళ్ళు చినముత్తేవినుండే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అమ్మమ్మకు బాగోలేదుగా మరి.

పూర్తి షెడ్యూలు రెండు మూడు రోజుల్లో చెబుతానేం.

Wednesday, February 15, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - మొదటి రోజు

బుధవారం, మాఘ బహుళ విదియ, 1927 శా.శ

నేను నిద్రలేచే సరికి నాన్న నా ప్రక్కనే పడుకుని వున్నాడు. ఇంతలో తాతగారు గుడికి వెళ్ళడానికి రడీ అవ్వమని నాన్నని పిలిచారు. నాకో ముద్దు పెట్టి స్నానానికి వెళ్ళాడు నాన్న. అమ్మ నిదానంగా అందరి స్నానాలూ అయిన తర్వాత నాకూ స్నానం చేయించి గుడి దగ్గరకు తీసుకు వస్తానంది.

అదేంటో, చుట్టాలందరూ వచ్చారా ... సరిగ్గా టైం చూసి మోటర్‌ చెడిపోయింది - బావి దగ్గరికెళ్ళి తోడుకు వస్తున్నారు.

సుమారుగా 11 గం.కు గుడి కెళ్ళా అమ్మతో కలిసి. ఆల్రెడీ పూజ సగంలో వున్నట్టుంది. ఇంతకు ముందే పాత విగ్రహాల్ని వదిలేసి, కొత్త వాటిని (పెదనాన్న బెంగళూరు నుండి వచ్చేటప్పుడు తెనాలి నుండి తీసుకు వచ్చారు) ఐలూరు కృష్ణానదిలో స్నానంచేయించడానికి తీసుకువెళ్ళారట. బోల్డంత మంది మనుషులు ... ఎవరో ఏమిటో తెలీదు. నాన్నేమో డిజిటల్‌ కెమెరా, హాండీకామ్‌ తగిలించుకుని హడావుడిగా తిరిగేస్తున్నాడు. నన్నేమైనా తీసాడో లేదో !

జానూ అక్కా, ఇండోరు బావలూ చాలా బిజీగా ఆడుకుంటున్నారు. అంతా గొడవ గొడవగా వుంది. నన్నేమో తాతగారి పక్కింట్లో అద్దెకుంటారంట - ఆవిడ వళ్ళో పడుకోబెట్టింది అమ్మ. - ఇక్కడే నిద్దరోతే సరి !!!

Tuesday, February 14, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - కౌంట్‌డౌన్‌ 1

మంగళవారం, మాఘ బహుళ పాడ్యమి, 1927 శా.శ

చినముత్తేవి చేరుకున్నాం. తెల్లవారు ఝామున గుడివాడలో విశాఖపట్నం-మచిలీపట్నం పాసెంజరు దిగి, టక్సీలో చినముత్తేవి వచ్చాం. టాక్సీలోంచి చూస్తుంటే మబ్బు తెరలాగా మంచు .. దారి కనబడనీయకుండా. టాక్సీ ఎక్కిన కొద్దిసేపటికి నేను నిద్రపోయా.

తాతగారు రాకపోవడానికి యాక్సిడెంటు కారణమన్నానుగా. పాపం బాగానే దెబ్బలు తగిలాయి. అదృష్టం అంటున్నారు అందరూ. తాతగారూ, నానమ్మ బందరు (మచిలీపట్టణం) వెళుతూ వుంటే నిడుమోలు దగ్గర స్కూటర్‌ వెనక చక్రం వూడిపోవటం వల్ల పడిపోయారట. నానమ్మ దూరంగా పడిందట, ముఖం మీద, కాళ్ళమీదా బాగా తగిలాయి. తాతగారి మీద స్కూటర్‌ పడిపోయి కాలికి పెద్ద గాయం అయ్యింది. రేపు గుడిలో పూజకు ఎలా కూర్చుంటారో ఏమో..!!!

చిత్రం ఏమిటంటే, అంతకు ఓ నాల్రోజుల మునుపే స్కూటర్‌ ఫుల్‌ సర్వీసై తిరిగొచ్చిందంట. అయినా ఏమిటో ప్రారబ్ధం.

సర్వే జనా సుఖినో భవంతు.