Wednesday, November 02, 2005

నేను పుట్టాను...

నవంబర్‌ 2, 2005

కార్తీక శుక్ల పాడ్యమి, స్వాతి, ఉదయం 08:16 నిమిషాలు - డాక్టర్‌ అప్పారావు గారి శ్రీ రామా నర్సింగ్‌హోమ్‌, పామర్రు, కృష్ణా జిల్లాలో నేను పుట్టాను.

అసలు నా పుట్టుకకు ఓ చిన్న విశేషం వుంది తెలుసా? నవ్వకుండా చదవండేం!

సుమారు ఓ నెల్రోజుల క్రితం మా తాతలు (ఇద్దరూ) మాట్లాడు కున్నారట -- మా అమ్మకు సీమంతం తొమ్మిదో నెలలో చేద్దామని. డేటు కూడా ఫిక్స్‌ చేసుకున్నారు నవంబరు 3 అని. మొదలు మా అమ్మమ్మా వాళ్ళు మా నానమ్మ వాళ్ళింట్లోనూ, తర్వాత మా నానమ్మా వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళింట్లోనూ సీమంతం చేయాలంట. అందుకు గానూ వైజాగు పట్టణంలో వున్న అమ్మను సీమంతానికి ఓ వారం రోజుల ముందు చినముత్తేవికి తీసుకు రమ్మని నాన్నకు చెప్పారట. నాన్న కొత్త ఇంటి వ్యవహారంలో వుండి కుదరక, తాతయ్యనే పంపాడట.

నవంబరు 1 దీపావళి, నవంబరు 3 సీమంతం కనుక అన్నీ కలిసి వస్తాయని చినముత్తేవి తాతయ్య అత్తా వాళ్ళను, పెదనాన్నా వాళ్ళను అందర్నీ రమ్మన్నాడు. అలాగే అందరూ వచ్చారు. నాన్న పెద్దమ్మనూ, అక్కనూ తీసుకుని బెంగళూరు నుండి ఒకటో తారీకు మధ్యాహ్నం వచ్చాడు. పెదనాన్నకు పని వుండి రాలేదు.

తెల్లారితే సీమంతం అనగా, రాత్రి అమ్మకు నొప్పులు వచ్చాయట (ఆహ్హ! నా ప్రతాపమే అది). రాత్రి 2 గంటల వరకూ చూసి తగ్గక పోతే, విషయమేమిటో తెలీక పామర్రు డాక్టరు గారికి ఫోను చేసి బయలుదేరారు. స్కానింగు రిపోర్టులన్నీ చూసాక డెలివరీకి ఇంకా నెలరోజులు టైం వుంది కనుక, అమ్మ కడుపులోనే నేను పెరగాలని (పాపం! ఆ డాక్టరుకేం తెలుసు నేను ఆల్రెడీ పెరిగే వున్నానని), నొప్పులు తగ్గడానికేవో మందులు, ఇంజెక్షన్లూ ఇచ్చాడు. తెల్లారి నాలుగూ, అయిదూ ఐనా అమ్మకు నొప్పులు తగ్గలా. (నా తఢాకా ఏంటో అప్పటికింకా తెలీదు వాళ్ళకి!).

చినముత్తేవి తాతగారికీ, నాన్నకూ అనుమానం వచ్చి, ఇంకో డాక్టరు తాతగారితో కూడా మాట్లాడారు. చివరికి 7 గంటలకు డెలివరీ చేద్దామని డిసైడ్‌ అయ్యారట. (అసలు సంగతి వాళ్ళెవ్వకీ తెలీదు… మీకు చెబుతున్నా వినండి. అమావస్య వెళ్ళేవరకూ కావాలనే నేను ఆగాను!). చివరకు, 08:16 కు నేనొచ్చేశాను.

అసలు అమ్మకు ఆమాత్రం కష్టం కుడా ఇవ్వకుండా వచ్చేద్దామనుకున్నా, వెధవది, పేగొకటి నా మెడకూ, కాళ్ళకూ తగులుకుంది. అందుకే కొద్దిగా అమ్మను కష్టపెట్టాల్సి వచ్చింది. పాపం! దీనివల్ల నా మేనమామ నన్ను డైరెక్టుగా చూడకూడదట. ఆందుకోసం పదకొండో రోజున నూనెలో నన్ను చూపించారు.

ఇదండీ నా పుట్టుకకు ముందు విశేషం. డిశెంబరు 2 న పుడతానను కున్నారు, కానీ ఓ నెలముందే పుట్టేశా! సీమంతానికని వచ్చినవాళ్ళు, సీమంతానికంటే ఓ రోజు ముందు నన్నే చూసి వెళ్ళారు. ఇంకో విషయం, వైజాగు నుండి సాయంకాలం సీమంతానికి బయలు దేరదామనుకున్న అమ్మమ్మా, తాతయ్యా, నే పుట్టానని తెలిసి పొద్దున్నే బయలుదేరారు. అంతా విన్నారుగా, ఇక నన్ను ‘నెలతక్కువ వెధవా’ అని తిడతారా ఏమిటి???

0 అభిప్రాయాలు :

Post a Comment

<< Home