Tuesday, November 22, 2005

బారసాల - 2

నవంబర్‌ 22, 2005

ఈ రోజు మళ్ళీ నా బారసాల జరిగింది.

ఈ సారి జరిగింది వైజాగు పట్టణంలో, శివ ప్రసాదు తాతగారింట్లో. కానీ ఈ సారీ లాభం లేక పోయింది. మళ్ళా నేను నిద్రపోయా. అదేంటో గానీ, స్నానం చేయించిన కొద్ది సేపటికే నాకు నిద్ర ముంచుకొస్తుంది. సాయంత్రం సుమారు ఆరున్నరా, ఏడూ మధ్యలో ఫంక్షన్‌ మొదలయ్యింది. నాన్న ఫంక్షన్‌ మొదలయ్యేందుకు కొద్ది నిముషాల ముందు ఫోన్‌ చేశాట్ట. ఈ సారీ ఓ తిరకాసుందండోయ్. ఫంక్షన్‌ కు నానమ్మ తరపు వాళ్ళెవ్వరూ రాలేదు, చివరకు నాన్న కూడా. నాకు చాలా బాధేసింది. అమ్మ అంటుంది, 'మీ నాన్న కావాలనే రాలేదురా సాయీ...' అని. (నిఝమా నాన్నా!)

చిత్రంగా నానీ మామ (రవికిరణ్‌) కూడా మిస్సయ్యాడు ... ఏదో ఇంటర్వ్యూ వుందట, వూళ్ళో లేడు.
మరిన్ని విషయాలు మళ్ళా!

Tuesday, November 15, 2005

డాక్టర్‌ షెడ్యూల్

15 నవంబరు 2005

కార్తీక చతుర్దశి

హాయ్‌!

సారీ, ఈ సారి కొంచెం లేటయ్యింది. కొత్త ప్రపంచం, కొత్త మనుషులు ... అర్థం చేసుకోవడానికీ, అర్థం అవ్వడానికీ టైమ్‌ పడ్తుంది కదా! ఏమంటారు ? ప్రస్తుతానికి నేను వైజాగ్‌లో వున్నానని చెప్పానుగా!

మొన్న నన్ను డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళారు. పుట్టాక కొన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చెయ్యాలిగా మరి. డాక్టరు గారు నాకిచ్చిన షెడ్యూలిది.

డా శేషగిరి రావు. ఎమ్‌.డి, పీడియాట్రీషియన్‌,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్ పీడియాట్రిక్స్, కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌.

15 NOV 2005 (పుట్టినప్పుడు చేయాల్సింది)
బి సి జి వాక్సినేషన్‌, ఓరల్‌ పోలియో వాక్సినేషన్‌ ( మొదటి డోసు)
17 DEC 2005 (6 వారాలు)
డి టి పి + హెపటైటిస్ బి, హెచ్ ఐ బి వాక్సిన్‌, ఓరల్‌ పోలియో వాక్సినేషన్‌ (రెండవ డోసు)
20 JAN 2006 (10 వారాలు)
డి టి పి + హెపటైటిస్ బి, హెచ్ ఐ బి వాక్సిన్‌, ఓరల్‌ పోలియో వాక్సినేషన్‌ (మూడవ డోసు)
25 FEB 2006 (14 వారాలు)
డి టి పి + హెపటైటిస్ బి, హెచ్ ఐ బి వాక్సిన్‌, ఓరల్‌ పోలియో వాక్సినేషన్‌ (నాల్గవ డోసు)
10 AUG 2006 (9 నెలలు)
మీసిల్స్‌

ఈ షెడ్యూల్‌ ప్రకారం మొదటి డోసు అయిపోయింది ఇవ్వాల్టికి. అసలే నాది చిట్టి ప్రాణం, ఈ ఇంజెక్షన్‌లకూ వాటికీ తట్టుకోలేదు. ఇవ్వాల్టికి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఏడుపు కంటిన్యూ చెయ్యాలిగా మరి !!

Saturday, November 12, 2005

బారసాల - 1

నవంబర్ 12, 2005

కార్తీక ఏకాదశి.ఈ రోజు నా బారసాల.

చినముత్తేవి తాత గారింట్లో జరిగింది. అబ్బో బోల్డంత మంది వచ్చారట. సాయంత్రాని కల్లా నాకు స్నానం చేయించి,రెడ్ కలర్‌ డ్రస్ వేసారు.ఆ తర్వాత కొద్ది సేపటికే నేను అమ్మమ్మ చేతిలో నిద్ర పోయా! చుట్టాలు, తాతగారి,నానమ్మ స్నేహితులు, ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ ఒకటే లోటు, అమ్మ తరపు చుట్టాలెవరూ రాలేదు, అమ్మమ్మ,అమ్మమ్మమ్మ తప్ప. ఫంక్షన్‌ జరిగినంతసేపు నేను నిద్రపోయాను. ఎలా జరిగిందో, ఎవరెవరు వచ్చారో తెలీదు, కానీ అమ్మనీ, లేదా నాన్ననీ కనుక్కుని తర్వాత దీన్ని అప్‌డేట్‌ చేస్తాను.

ఇక ఉంటాను!

Tuesday, November 08, 2005

అమ్మయ్య!

నవంబర్‌ 8, 2005

కార్తీక శుక్ల సప్తమి. ఈ రోజు మా అమ్మకు పురిటి స్నానం చేయించారు.

ఆస్పత్రిలో (నేను పుట్టిన తర్వాత) రెండ్రోజులున్న తర్వాత, మూడోరోజు (మంచిదని) నన్ను, అమ్మను ఇంటికి (చినముత్తేవి) తీసుకు వచ్చారు. ఆస్పత్రిలో వున్నన్ని రోజులూ మా నానమ్మ స్నేహితురాళ్ళు, శిష్యులూ చాలా సహాయం చేశారు. నేను పుట్టగానే మొదట చూసింది …………………… మొదట నానమ్మ చేతిలోకి వెళ్ళా. అమ్మ ఇప్పటం అమ్మమ్మ, తాతయ్య; వైజాగు అమ్మమ్మ, తాతయ్య; సామర్లకోట చిన్నమ్మమ్మ వీళ్ళు మా అమ్మ తరపున మొదటగా చూసిన వాళ్ళు. అమ్మమ్మ మాత్రం నాకోసం ఇక్కడే (చినముత్తేవిలో) వుండి పోయింది – అమ్మకూ, నాకూ సాయంగా.

నెలరోజుల ముందుగా పుట్టినా, అంతా బాగనే వుంది కనుక డాక్టరు ప్రత్యేక జాగ్రత్తలేమీ చెప్పలేదు. కాకపోతే ఉదయపుటెండలో ఓ అరగంట వుంచమన్నారు. దానివల్ల ప్రకృతి సహజమైన ‘డి’ విటమిన్‌ లభిస్తుందట.

అమ్మ పురిటి స్నానం రోజున, అమ్మ పుట్టింటి తరపువాళ్ళు వచ్చారు. అందరి పేర్లూ సరిగ్గా గుర్తులేవు, ఓ సారి అమ్మను కనుక్కుని అప్‌డేట్‌ చేస్తాను.

ఇన్నిరోజులూ పాలు సరిగా తాగట్లేదని అందరూ ఒకటే గొడవ. కానీ ఈ రోజునుండి (అంటే పురిటి స్నానం అయిన తర్వాత నుండీ) తాగుదామని నిర్ణయించుకున్నా. శుభ్రత ముఖ్యం కదండీ మరి !!!

Wednesday, November 02, 2005

నేను పుట్టాను...

నవంబర్‌ 2, 2005

కార్తీక శుక్ల పాడ్యమి, స్వాతి, ఉదయం 08:16 నిమిషాలు - డాక్టర్‌ అప్పారావు గారి శ్రీ రామా నర్సింగ్‌హోమ్‌, పామర్రు, కృష్ణా జిల్లాలో నేను పుట్టాను.

అసలు నా పుట్టుకకు ఓ చిన్న విశేషం వుంది తెలుసా? నవ్వకుండా చదవండేం!

సుమారు ఓ నెల్రోజుల క్రితం మా తాతలు (ఇద్దరూ) మాట్లాడు కున్నారట -- మా అమ్మకు సీమంతం తొమ్మిదో నెలలో చేద్దామని. డేటు కూడా ఫిక్స్‌ చేసుకున్నారు నవంబరు 3 అని. మొదలు మా అమ్మమ్మా వాళ్ళు మా నానమ్మ వాళ్ళింట్లోనూ, తర్వాత మా నానమ్మా వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళింట్లోనూ సీమంతం చేయాలంట. అందుకు గానూ వైజాగు పట్టణంలో వున్న అమ్మను సీమంతానికి ఓ వారం రోజుల ముందు చినముత్తేవికి తీసుకు రమ్మని నాన్నకు చెప్పారట. నాన్న కొత్త ఇంటి వ్యవహారంలో వుండి కుదరక, తాతయ్యనే పంపాడట.

నవంబరు 1 దీపావళి, నవంబరు 3 సీమంతం కనుక అన్నీ కలిసి వస్తాయని చినముత్తేవి తాతయ్య అత్తా వాళ్ళను, పెదనాన్నా వాళ్ళను అందర్నీ రమ్మన్నాడు. అలాగే అందరూ వచ్చారు. నాన్న పెద్దమ్మనూ, అక్కనూ తీసుకుని బెంగళూరు నుండి ఒకటో తారీకు మధ్యాహ్నం వచ్చాడు. పెదనాన్నకు పని వుండి రాలేదు.

తెల్లారితే సీమంతం అనగా, రాత్రి అమ్మకు నొప్పులు వచ్చాయట (ఆహ్హ! నా ప్రతాపమే అది). రాత్రి 2 గంటల వరకూ చూసి తగ్గక పోతే, విషయమేమిటో తెలీక పామర్రు డాక్టరు గారికి ఫోను చేసి బయలుదేరారు. స్కానింగు రిపోర్టులన్నీ చూసాక డెలివరీకి ఇంకా నెలరోజులు టైం వుంది కనుక, అమ్మ కడుపులోనే నేను పెరగాలని (పాపం! ఆ డాక్టరుకేం తెలుసు నేను ఆల్రెడీ పెరిగే వున్నానని), నొప్పులు తగ్గడానికేవో మందులు, ఇంజెక్షన్లూ ఇచ్చాడు. తెల్లారి నాలుగూ, అయిదూ ఐనా అమ్మకు నొప్పులు తగ్గలా. (నా తఢాకా ఏంటో అప్పటికింకా తెలీదు వాళ్ళకి!).

చినముత్తేవి తాతగారికీ, నాన్నకూ అనుమానం వచ్చి, ఇంకో డాక్టరు తాతగారితో కూడా మాట్లాడారు. చివరికి 7 గంటలకు డెలివరీ చేద్దామని డిసైడ్‌ అయ్యారట. (అసలు సంగతి వాళ్ళెవ్వకీ తెలీదు… మీకు చెబుతున్నా వినండి. అమావస్య వెళ్ళేవరకూ కావాలనే నేను ఆగాను!). చివరకు, 08:16 కు నేనొచ్చేశాను.

అసలు అమ్మకు ఆమాత్రం కష్టం కుడా ఇవ్వకుండా వచ్చేద్దామనుకున్నా, వెధవది, పేగొకటి నా మెడకూ, కాళ్ళకూ తగులుకుంది. అందుకే కొద్దిగా అమ్మను కష్టపెట్టాల్సి వచ్చింది. పాపం! దీనివల్ల నా మేనమామ నన్ను డైరెక్టుగా చూడకూడదట. ఆందుకోసం పదకొండో రోజున నూనెలో నన్ను చూపించారు.

ఇదండీ నా పుట్టుకకు ముందు విశేషం. డిశెంబరు 2 న పుడతానను కున్నారు, కానీ ఓ నెలముందే పుట్టేశా! సీమంతానికని వచ్చినవాళ్ళు, సీమంతానికంటే ఓ రోజు ముందు నన్నే చూసి వెళ్ళారు. ఇంకో విషయం, వైజాగు నుండి సాయంకాలం సీమంతానికి బయలు దేరదామనుకున్న అమ్మమ్మా, తాతయ్యా, నే పుట్టానని తెలిసి పొద్దున్నే బయలుదేరారు. అంతా విన్నారుగా, ఇక నన్ను ‘నెలతక్కువ వెధవా’ అని తిడతారా ఏమిటి???