Wednesday, February 15, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - మొదటి రోజు

బుధవారం, మాఘ బహుళ విదియ, 1927 శా.శ

నేను నిద్రలేచే సరికి నాన్న నా ప్రక్కనే పడుకుని వున్నాడు. ఇంతలో తాతగారు గుడికి వెళ్ళడానికి రడీ అవ్వమని నాన్నని పిలిచారు. నాకో ముద్దు పెట్టి స్నానానికి వెళ్ళాడు నాన్న. అమ్మ నిదానంగా అందరి స్నానాలూ అయిన తర్వాత నాకూ స్నానం చేయించి గుడి దగ్గరకు తీసుకు వస్తానంది.

అదేంటో, చుట్టాలందరూ వచ్చారా ... సరిగ్గా టైం చూసి మోటర్‌ చెడిపోయింది - బావి దగ్గరికెళ్ళి తోడుకు వస్తున్నారు.

సుమారుగా 11 గం.కు గుడి కెళ్ళా అమ్మతో కలిసి. ఆల్రెడీ పూజ సగంలో వున్నట్టుంది. ఇంతకు ముందే పాత విగ్రహాల్ని వదిలేసి, కొత్త వాటిని (పెదనాన్న బెంగళూరు నుండి వచ్చేటప్పుడు తెనాలి నుండి తీసుకు వచ్చారు) ఐలూరు కృష్ణానదిలో స్నానంచేయించడానికి తీసుకువెళ్ళారట. బోల్డంత మంది మనుషులు ... ఎవరో ఏమిటో తెలీదు. నాన్నేమో డిజిటల్‌ కెమెరా, హాండీకామ్‌ తగిలించుకుని హడావుడిగా తిరిగేస్తున్నాడు. నన్నేమైనా తీసాడో లేదో !

జానూ అక్కా, ఇండోరు బావలూ చాలా బిజీగా ఆడుకుంటున్నారు. అంతా గొడవ గొడవగా వుంది. నన్నేమో తాతగారి పక్కింట్లో అద్దెకుంటారంట - ఆవిడ వళ్ళో పడుకోబెట్టింది అమ్మ. - ఇక్కడే నిద్దరోతే సరి !!!

Tuesday, February 14, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - కౌంట్‌డౌన్‌ 1

మంగళవారం, మాఘ బహుళ పాడ్యమి, 1927 శా.శ

చినముత్తేవి చేరుకున్నాం. తెల్లవారు ఝామున గుడివాడలో విశాఖపట్నం-మచిలీపట్నం పాసెంజరు దిగి, టక్సీలో చినముత్తేవి వచ్చాం. టాక్సీలోంచి చూస్తుంటే మబ్బు తెరలాగా మంచు .. దారి కనబడనీయకుండా. టాక్సీ ఎక్కిన కొద్దిసేపటికి నేను నిద్రపోయా.

తాతగారు రాకపోవడానికి యాక్సిడెంటు కారణమన్నానుగా. పాపం బాగానే దెబ్బలు తగిలాయి. అదృష్టం అంటున్నారు అందరూ. తాతగారూ, నానమ్మ బందరు (మచిలీపట్టణం) వెళుతూ వుంటే నిడుమోలు దగ్గర స్కూటర్‌ వెనక చక్రం వూడిపోవటం వల్ల పడిపోయారట. నానమ్మ దూరంగా పడిందట, ముఖం మీద, కాళ్ళమీదా బాగా తగిలాయి. తాతగారి మీద స్కూటర్‌ పడిపోయి కాలికి పెద్ద గాయం అయ్యింది. రేపు గుడిలో పూజకు ఎలా కూర్చుంటారో ఏమో..!!!

చిత్రం ఏమిటంటే, అంతకు ఓ నాల్రోజుల మునుపే స్కూటర్‌ ఫుల్‌ సర్వీసై తిరిగొచ్చిందంట. అయినా ఏమిటో ప్రారబ్ధం.

సర్వే జనా సుఖినో భవంతు.

Sunday, February 12, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - కౌంట్‌డౌన్‌ 2

ఆదివారం, మాఘ శుద్ధ చతుర్దశి, 1927 శా.శ

నిన్న నాన్న వచ్చాడు హైదరాబాదు నుండి. ఎప్పటిలాగే సాయంకాలం 4:30 కు రిజర్వు చేసుకున్న బస్సు మిస్సయ్యి, ఇమ్లీబన్‌లో 6:00 గం. బస్‌కు బయలుదేరి వచ్చాడు. (పాపం! నాన్నకెందుకో రిజర్వు చేసుకున్నప్పుడల్లా బస్సు (ట్రైనైనా సరే) మిస్సవుతూంటుంది.)

ఈ రోజు నాన్న అమ్మతో అంటూంటే విన్నా... తాతగారికి, నానమ్మకూ యాక్సిడెంట్‌ అయ్యిందంట - అందుకే నన్ను తీసుకెళ్ళడానికి తాను రాలేక నాన్నను పంపారంట. యాక్సిడెంటు జరిగి అప్పటికే వారంరోజులయ్యిందంట కానీ ఎవ్వరికీ చెప్పలేదంట. నాన్నకు కూడా రామారావు తాతయ్య వాళ్ళబ్బాయి గృహప్రవేశానికి (కుకట్‌పల్లి దగ్గర) వెళితే, అక్కడెవరో చినముత్తేవి నుండి వచ్చినవాళ్ళు చెప్పారట.

రేపు రాత్రికి చినముత్తేవికి బయలు దేరుతున్నాం - ముఖ్యంగా తాతగార్ని చూడడానికి.

Thursday, February 09, 2006

విగ్రహ ప్రతిష్ఠాపన - కౌంట్‌డౌన్‌ 3

గురువారం, మాఘ శుద్ధ ద్వాదశి, 1927 శా.శ

తాతగారి (గోపాలకృష్ణయ్య) దగ్గరినుండి పిలుపు వచ్చిందట. నాన్న అమ్మతో చెప్పాడు. ఈ నెల బహుళ విదియ నుండి చవితి వరకూ చినముత్తేవిలో పునరుద్ధరిస్తున్న రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనట. దానికి తప్పనిసరిగా అందరూ రావాలట. బెంగుళూరు నుండి పెదనాన్నావాళ్ళూ, ఇండోరు నుండి బుజ్జత్తా వాళ్ళూ, వైజాగు నుండి నేనూ అమ్మా, హైదరాబాదు నుండి నాన్నా రావాలట.

దీనికోసమే నాన్న హైదరాబాదు నుండి వైజాగు వస్స్తున్నాడు నన్నూ, అమ్మనూ తీసుకెళ్ళడానికి. తాతగారెందుకు రావటంలేదో మరి??

ప్రతిష్ఠాపన అయిపోయిన తరువాత మళ్ళా నాన్నే దింపుతాడో, లేక తాతగారో ... కనుక్కోవాలి.

అసలు విషయం మర్చిపోయా, తాతగారు వినాయక విగ్రహాన్నీ, పెదనాన్న ఆంజనేయ విగ్రహాన్నీ, మిగిలిన విగ్రహాల్ని వేరేవాళ్ళూ ప్రతిష్ఠిస్తున్నారట.

ప్రతిష్ఠాపన విశేషాలు మరలా తెలియజేస్తాను.